Wednesday, April 9, 2014

బుడగ తామర

                                                       

 నా పేరు బుడగ తామర. బహుశా మీరు తెలుగు పదాలను మరిచి పోయి ఉంటారు. అందరూ నన్ను వాటర్ హేసెన్త్ అని అంటున్నారు. ఇప్పటి ఆధునిక ప్రపంచములో నా మీద చాల ఆరోపణలు మరియు నిందలు వస్తున్నాయి. ఎప్పుడూ నీటిలో ఉండే నేను నీటి ప్రవాహానికి అడ్డు వస్తున్నానుట. నా వలన నీటి ప్రవాహము ఎక్కువయి  వరదలు వచ్చే పరిస్థితులు వచ్సినాయిట. ప్రతి సారి నన్ను తొలగించడానికి చాలా ఖర్చు పెట్ట వలసి వస్తున్నాదిట. ఇంతకూ ముందు అలా తీసి పడేసే వారు. ఇప్పుడు ఏవో విష పదార్థాలు చల్లి నన్ను చంపేస్తున్నారు. లూయీస్ పాశ్చర్ ఏమి మాయ చేసాడో కానీ, ప్రతి దానికి విష పదార్థాలు వాడి భూమిని విష పూరితము చేయడము బాగా అలవాటు అయింది. ఇపుడు మీరు ఉన్న వేగములో నేను ఏమి చెప్పినా మీకు వినే ఓపిక ఉన్నదని నేను అనుకోను, అయినా చెప్పడము నా భాద్యతగా భావించి విషయము చెప్పాలని అనుకుంటున్నాను.
          సుమారు ముప్పది లేక నలువది ఏళ్ల క్రిందట, మేము  ఎక్కడో చెరువులలో, నూతులలో, ఒక మూల ఉండే దాన్ని. అసలు మేమున్నామన్న విషయము మాకు తప్ప మరొకరికి తెలిసేది కాదు. క్రమ క్రమముగా  నగరాలు పెరిగే కొద్దీ కొన్ని మార్పులు వచ్చినవి. పల్లెలకు నగరాలు పాకిన తరువాత  పంట కాలువల పక్కనే పెద్ద భవనాలు వచ్చినాయి. అప్పుడు ఆ నీరు పొలాలకు పోవడమే కాదు. దారిన పోయే వారు ఎవరయినా దాహము వేస్తె నేరుగా కాలువలో నిరు త్రాగే వారు. ఆ పని ఇప్పుడు మీరు చేయండి, మీరు వైద్యుడి దగ్గిరకి వెళ్ళాలా, కాటికి వెళ్ళాలా అనే విషయము మీకే తెలియదు.  ఇప్పుడు సమస్య మరో రకముగా వచ్చినది.  ఈ పంట కాలువల  ప్రక్కన వచ్చిన భవనాల నుండి వచ్చిన నిషిద్ద మల మూత్ర పదార్థములతో కూడిన నీరు నేరుగా ఈ కాలువల లోనికి వదలుట మొదలు పెట్టినారు. ఈ విధముగా ఒకప్పుడు అందరు త్రాగే నీరు అపరి శుభ్రము అయినవి.
          వృక్ష జాతికి చెందిన మేము ఎప్పుడూ ప్రకృతిని శుభ్రము చేయుటకే ప్రయత్నమూ చేస్తున్నాము. మీకు గుర్తు ఉంటే ఒక చిన్న తామర జాతికి చెందిన చిన్ని మొక్కలను నూతిలో నీళ్ళలో వేసే వారు. వాటి వలన నీరు శుభ్ర పడడమే కాదు, నీరు ఎంతో తియ్యగా తయారు అయేది. సీసాల్లో నీళ్ళు తప్ప వేరే నీరు తాగని మీకు అవి ఎక్కడ గుర్తు ఉంటాయి లెండి? మరొక విషయము చెప్పాలి. ఇది కొన్ని దశాబ్దాల క్రిందట జరిగినది. ఈ సంఘటన హిందు అనే ఆంగ్ల పత్రికలో పెద్ద వ్యాసముగా వచ్చినది. కాస్త జ్ఞాపక శక్తి యున్న వారికి ఈ విషయము గుర్తుండే యుంటుంది. ఒక విదేశీ యాత్రికుడు ఉదక మండలము కొండల పైన వాహ్యాళి చేస్తున్నాడు. బాగా దాహము వేసినది. అంతా చూచినాడు. ప్రక్కనే కొండ పై భాగము నుండి జల ధార వస్తున్నది. చేతులతో పట్టుకొని త్రాగినాడు. నీరు చాలా రుచిగా ఉన్నది. త్రాగిన  తరువాత అనుమానము వచ్చినది, ఇప్పుడు వర్షా కాలము కూడా కాదు కదా! ఈ నీరు ఎక్కడినుండి వచ్చినది? అని. ఆ నీటి ధార ప్రక్కనే నెమ్మదిగా కొండ పైకి ఎక్కినాడు.  కొండ పైకి చేరిన తరువాత ఆశ్చర్య పోయినాడు. ఎందుకంటే ఆ నీరు పైన యున్న అతిథి గృహము నుండి బయటికి వస్తున్న మురికి నీరు . అక్కడ భయంకరముగా దుర్వాసన వేస్తున్నది. తనకు ఏ జబ్బు వస్తుందో అని భయము వేసినది. వెంటనే తను నీరు త్రాగిన చోట నీరు సీసాలో పట్టి  రసాయనిక విశ్లేషణ కు పంపించినాడు. అది ఏ దోషము లేని మంచి నీరు అని వారు తేల్చి చెప్పినారు. అంటే ఆ నీరు ఆ వాలులో గడ్డి పైన దిగుతున్నపుడు  శుభ్ర పడినాయన్న మాట.
                   మ ళ్ళీ చెబుతున్నాను, మా వృక్ష జాతి వలన మీకు మేలు జరుగుటున్నదే కాని, కీడు జరుగుట లేదు. ఈ నాడు పట్టణాలు పల్లె ల లోకి పెరిగిన తరువాత పంట కాలువల ప్రక్కన భవనాలు బాగా పెరిగినవి. ఆ భవనాల లోని
మురికి నీరు అంతా పంట  కాలువల లోనికి వదులుతున్నారు. ఈ విధముగా పంట కాలువల లో మురికి ఎక్కువగా చేరినపుడు, మేము అక్కడ చేరుతున్నాము. మీరొక సారి పరీక్ష గా చూడండి. మా ఆకుల క్రింద నీరు  మా వెలుపల యున్న నీరు పరీక్ష గా చూడండి. మా క్రింద నీరు ఎంత శుభ్రముగా యుందో  మీకు తెలుస్తుంది. అంతే కాదు, కొన్ని రకాల విష మూలకాల నుండి భూమి పై  మట్టిని మేము శుభ్రము చేస్తాము. నీరు శుభ్రము చేయడములో మా సంఖ్య సరి పోవుట లేదు. అయినా మా సంఖ్య ఎక్కువయి వరదలు వస్తున్నాయి అని అంటున్నారు. రహదారులు పూర్తిగా జనముతో నిండి పోయినపుడు మీరు వేగముగా ఆ దారిలో వెల్ల గలరా?
          మిమ్ములను గూర్చి నేను చెబితే మీకు చాలా కోపము వస్తుంది. అయినా చెబుతాను. నేను చెప్పేవన్నీ మీకు తెలియనివి కాదు.
          ఒకప్పుడు ధర్మము నాలుగు పాదాలలో నడిచే రోజులలో ఒక ఋషి యాత్ర లోయున్నాడుట. విపరీతముగా ఆకలి వేసినది. భిక్ష కోసము చూస్తే పరిసరాల్లో ఎవరూ లేరు. ఎదురుగా ఒక మామిడి తోట కనిపించినది.  బాగుగా పండిన మామిడి పండ్లు చెట్లకు వ్రేలాడుతున్నవి. వాటితో ఆకలి తీర్చుకోవాలని చుట్టు పక్కల తోట మాలి కోసము వెదికినాడు. ఎవరూ కనిపించ లేదు. ఆకలి భరించ లేక ఒక పండు కోసుకొని తిన్నాడు. కాస్త ఆకలి తీరగానే తనలో  తప్పు చేసినానన్న భావన విపరీతముగా పెరిగినది. ఎవరి అనుమతి లేకుండా తను తిన్న పండుకు తను ఎంత దుష్కర్మను అనుభవించ వలనో అని అనిపించినది.
          వెంటనే ఆ ప్రాంతమును ఏలుతున్న రాజు దగ్గరికి వెళ్ళినాడు.  యజమాని అనుమతి లేకుండా పండు కోసుకొని తిన్నందుకు, ఆ దొంగ తనానికి తనను శిక్షించ వలసినదిగా కోరినాడు. ఆ రాజు ఇతడిని చూచినాడు, గొప్ప తపస్విలా కనిపిస్తున్నాడు. ఇతడిని శిక్షింప గలిగిన శక్తిమంతుడు కాదు తను. అదే మాట అన్నాడు. అతడు మరీ బలవంతము చేస్తే తన ఆస్థానములో పని చేస్తూ ధర్మ శాస్త్ర కోవిడుదయిన బ్రాహ్మణుడిని పిలిపిస్తాడు. ఆ తపస్వి ఇతడి తమ్ముదేనని అప్పుడు తెలిసినది. అతడి సలహా మీద తపస్వి పండు కోసిన చేతిని ఖండించమని ఆజ్ఞాపించాడు. అప్పుడు అన్న తన తమ్ముడిని దగ్గిరలో యున్న ఒక నది లో మునిగి లెమ్మని చెబుతాడు. అతడు అలా చేసేసరికి ఆని చేయి తిరిగి వస్తుంది.  
ఆ నదిని తరువాత బాహుదా నది పేరుతొ పిలిచినారు. బాహుదా అంటే చేతులను ఇచ్చినది అని అర్థము. అది యొక పవిత్రమయిన నదిగా పేరు కన్నది. అదే నది ఈ నాడు చిత్తూరు పట్టణము మధ్యలో ఒక మురుగు కాలువ వలె పారుతున్నది. వాయు పురాణములో ఒక పవిత్ర మయిన నదిగా పేరు కన్న గోస్తని నది ఇప్పుడు పరిశ్రమల మురికిని భారముగా మోసుకొని వెళుతున్నది. మీరే చెప్పండి, నేను నేను చెప్పేది నిజమే కదా!
          ఒకప్పుడు ఇంటి చుట్టు చెట్లుంటే చాలా మంచిదను కొనే వారు. ఇప్పుడు ప్రాకారము లోపల చెట్లుంటే రోజు వాటి ఆకులను చిమ్మాలిట, ఇది చాలా శ్రమతో కూడిన పని అట. మరి మీరు వాడే ప్లాస్టిక్ మురికి కంటే మా మురికి ఎక్కువ ఇబ్బంది కలిగిస్తున్నదా? మా వృక్ష జాతి వదిలే ఆకులు మట్టిలో కలిసి కరిగి పోతాయి. మరి ప్లాస్టిక్ అలా కలుస్తుందా? మా చెట్లు మీకు ప్రాణ వాయువు ను ఇస్తున్నది, వేసవిలో చల్లని నీడను ఇస్తున్నది, పండ్లు, కాయలు ఇస్తున్నది. అంతే కాదు, మీకు బాగా నీరసముగా యున్నపుడు యాచిస్తే ప్రాణ శక్తిని కూడా చాలా సంతోషముగా ఇస్తుంది. ఇదే మా జాతి యొక్క ప్రత్యేకత.
          ఇంత వఱకు నా గురించి చెప్పుకున్నాను. మీ గురించి చెప్ప వలసినది చాలా యున్నది.
          చెట్లను నరకి వేస్తున్నారు. అడవులు తగ్గిపోతున్నాయి. అందువలన సక్రమమయిన వర్షాలు తగ్గి పోయినాయి. మురికినంతా నీటి ప్రవాహాలలో వదిలి వేస్తున్నారు. కీటకాల పేరు చెప్పి పొలాలన్నీ విషమయము చేస్తున్నారు. నీటిని మురికి చేయకుండా యుంటే మీకు నీటి కరువు ఎక్కడున్నది? ఇంట్లో మురికిని కాలువలలో కల్పి వేసి చేతులు విదిలించి వేసుకుంటున్నారు. కానీ, తము మురికి చేసే నీళ్ళకు బదులుగా త్రాగే నీటిని లీటర్ ఇరువది రూపాయలకు అమ్ముతున్నారన్న విషయాన్నీ మఱచి పోయినారు. ఇన్ని నదులు కలిగి యున్న మన దేశములో మంచి నీటిని అమ్మే స్థితికి తీసుక వచ్చిన పాలకులు దేశాన్ని సిగ్గు పడే స్థితికి తీసుకు వచ్చినారు. ఈ నాడు ఆన కట్టలను కట్టడానికి అయే ఖర్చులో కొంత భాగము మురికి నీరు శుభ్రము చేయడానికి కాక నీరు మురికి చేయకుండా చేసే మంచి పద్ధతుల కొఱకు పరిశోధనలు చేస్తే దేశము బాగు పడుతుంది.
          మేము నీటిని శుభ్రము చేయాలని ఎంత ప్రయత్నము చేసినా మురికిని తాయారు చేసే మీ వేగాన్ని అందుకోలేక పోతున్నాము. అయినా మీ చేత శత్రువులుగా భావించ బడుతున్నాము.  మీరు శుభ్రతను నేర్చుకొని మన భూమికి సహకరిస్తారన్న ఆశతో-----------మీ బుడగ తామర.

         



No comments:

Post a Comment